చిరునవ్వు
సమూహ నిర్వహణః
వీరా గుడిపల్లిThe mathematics teacher and poet
యేరువ ఇందిరా రెడ్డి
Telugu teacher and poetess
************
న్యాయ నిర్ణేత
వకుళ వాసు గారు
**************
చిరునవ్వు అంశం పై కవుల వేదిక కు రాసినకవితలు
13/04/2020
1.అంబటి భాను ప్రకాష్ గారు
2.శ్రీదేవి సురేష్ కూసుమంచి గారు
3.శ్రీకాంత్ కడార్ల గారు
4.విజయ దుర్గ గారు
5.డాక్టర్ రామక క్రిష్ణ మూర్తి గారు
6.గుడిపూడి రాధికా రాణి గారు
7.చివుకుల శ్రీ లక్ష్మి గారు
8.మూర్తి శ్రీదేవి గారు
9.ఉదయశ్రీ ప్రభాకర్ గారు
10.వల్లాల విజయ లక్ష్మి గారు
11.రమాదేవి బాలబోయిన గారు
12.భూపతి గారు
13.పాలకుర్తి నాగ జ్యోతి గారు
14.బల్లూరి ఉమాదేవి గారు
****
1
చిరునవ్వు
కం.
నగవే ముఖమున కందము
నగవేనాచంద్రరేఖ నానావిధముల్!
తగినట్లు మనసు నిల్వగ
నగవే నడిపించు నెపుడు నమ్మికతోడన్!!
కం.
పసిపాపల నవ్వెప్పుడు
వసివాడనిమల్లెపూవు వరసలవిధమౌ!
ముసిముసి నవ్వే సిగ్గై
వసివాడని చెలియనవ్వు భాధలమాన్పున్
కం.
నగలే తనమది జూపును
నగవే తనభావనలను నమ్మగజూపీ
పగవాడెదురైనను చిరు
నగవే మిత్రునిగజేసి గడవగజేయున్!!
అంబటి భాను ప్రకాశ్.
2
అంశం-చిరునవ్వు
శ్రీదేవి సురేష్ కుసుమంచి
-----------------------------------
కాలమనే పందిరికి అల్లుకునే
జీవితపు తీగకు వికసించే పుష్పపు పరిమళము..
చిరునవ్వులు వికసించాలంటే
జీవితపు పాదుపై ఎంత వెన్నెల
వర్షము కురియాలో..
పిల్లగాలులో నృత్యము చేస్తుంటే
మనసు ఓ సుందరలోకములో తేలియాడుతున్నట్టుంటుంది..
అధరాలపై జనించే సహజ చిరునవ్వే
జీవిత ముఖచిత్రాన్ని
చిత్రిస్తుంది..
3.
అంశం: చిరునవ్వు
పేరు:శ్రీకాంత్ కడార్ల
కలం :శ్రీశైనిక
ఊరు :హన్మకొండ
శీర్షిక :నవ్వుతూ సాగిపో
తేది:13/4/2020
కటిక చీకటిలో ఉన్న రవ్వంత తారలు నవ్వుతూ ఉంటాయి
కొమ్మలపై పూసిన పూలు
గాలి తాకగానే నవ్వుతూ ఉంటాయి..
అల్లుకున్న ఆకుపచ్చని తీగల్లో
ఆ మల్లెలు అలా నవ్వుతుంటాయి
ప్రశాంతత మనసుకు పరవశించే పెదాలపై నవ్వే ముఖ్యం
నవ్వుతూ సాగాలి నవయవ్వనంగా సాగిపోవాలి జీవితం
కోపంలో ఊగిపోతున్న మనిషికి చిరునవ్వుతో బదులివ్వాలి
ద్వేషంతో రగిలి పోతున్న మనిషికి చిరునవ్వుతోనే జవాబివ్వాలి
ఎవరో తెలియని మనిషికి సైతం చిందించి బదులిచ్చి నిలిచే చిరునవ్వే నమ్మకం అవుతుంది
ముసి ముసి నవ్వులు మమతలను పండిస్తాయి
చిరు చిరు నవ్వుల స్నేహాన్ని చిగురింప చేస్తాయి
కాయ కష్టాలు కన్నీటి ధారలు
ఆ నవ్వులో మాయమవుతాయి
బాధలు బంధాలు భరించలేని శ్లోకాలు నవ్వుతో దూరమవుతాయి
చిరుదివ్వె చీకటిని పారద్రోలి నట్లు చిరునవ్వు చికాకులను దూరం చేస్తుంది..
ఏసిరి లేకున్నా సొగసరిగా నీ నవ్వు నీతో ఉండాలి
ఆపదలను వెక్కిరించే చిరునవ్వు భూషణుడై
కదలాలినీవు ఎదగాలి నువ్వు
4.
పేరు: విజయదుర్గ
కవితా అంశం : చిరునవ్వు
కవితా సంఖ్య: 15
తేదీ: 13/04/20
వసంతాలన్నీ పోగేసుకొని
హృదయాంతరాళంలో రంగులను
పూసి పుప్పొడి రాగాలలో
పెదవులపై తొణికిసలాడు
అందాల భామ....!!
అకాల వర్షం లా అకాల పరిస్థితుల
ఎదబీడుల నెర్రెలలో ఆనందతడి
లేక పూయలేని నిశ్శబ్ద గీతికై
రాలుతున్న కుసుమం....!!
మూఖవర్చస్సును తన హస్తంలో
ఇముడ్చుకొని
కనుల వెలుగు చిరునవ్వు
తానొక నిస్తేజమై మారుతూ రోదిస్తుంది....!!
ఎందుకో విషపు కోరలకు చిక్కు కొని
వ్రేలాడుతున్న కంటిపాప
మనలో ధైర్యమనే స్నేహంతోనే
తనకు జీవం
ఆత్మస్థైర్యం తో ఎదురీది
చిరునవ్వును సొంతం చేసుకో....!!
🌹వినీల🌹
5.
అంశం:చిరునవ్వు
తేది:13-4-2020
పేరు:డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, సికింద్రాబాద్.
**************************
సంసారసాగరాన్ని సులభంగా దాటించేది
ఆనందాన్ని పెదవిఅంచున నిలిపేది
అవకాశాన్ని పారిపోకుండా కాపాడేది
అదృష్టాన్ని విడవకుండా దాచేది
అపార్థాలను సుదూరతీరాలకు తరిమేసేది
ఆవేశాలను పెరగకుండా అణిచేది
అనర్థాలను జరగకుండా చూసేది
హృదయాలను నిస్సంకోచంగా గెలిచేది
శత్రువులను అభిముఖులుగా చేసేది
బాధలకు బందీలు కాకుండా కాపలా కాసేది
స్నేహాలకు చిరునామాలై మెలిగేది
మూర్ఖులకు మింగుడు పడకుండా మెరిసేది
బంధాలను విడిపోకుండా కట్టేసేది
ప్రేమలకు తొలిపొద్దై పొడిచేది
సంబంధాలను ధృడంగా తీర్చిదిద్దేది
జీవితాలను సక్రమంగా నడిపేది
ఆరోగ్యాన్ని సంపదగా ఇచ్చేది
నిష్కల్మషతను బయటికి వెలిబుచ్చేది
నిస్సహాయతను విధిలేక ప్రకటించేది
ఆధ్యాత్మికతను ఆసరాగా ఏర్పరిచేది
చిరునవ్వే చిరునవ్వే చిరునవ్వే
అందుకే హాయిగా నవ్వుదాం
ఆనందంగా బ్రతుకుదాం.
శశపశ
6
గుడిపూడి రాధికారాణి.
చిన్న నవ్వు నవ్వ చింతలన్నియు దీరు
శత్రు బాధలన్ని సమసిపోవు
నవ్వుచున్నవారె నచ్చునందరికిని
రాధికమ్మ వాక్కు రాణకెక్కు (01)
చీకటింటిలోన చిరుదీపముగ మార
గుండె గూటిలోని గుబులు తీర
చిరునగవును నీవు చిందించగా మేలు
రాధికమ్మ వాక్కు రాణకెక్కు (02)
నరుడు తప్ప నెవరు నవ్వనోచగలేరు
దేవుడిచ్చె వరము తెలుసుకొనుము
ఓటమొందువేళ ఓ నవ్వు గెలిపించు
రాధికమ్మ వాక్కు రాణకెక్కు (03)
ఒక్క నవ్వు తోడ ఒరుల గెలువ వచ్చు
నవ్వుకున్న శక్తి నరులకెరుకె
అట్టహాసమున్ను ఆనందమే ఇచ్చు
రాధికమ్మ వాక్కు రాణకెక్కు (04)
నవ్వుమేలుగాని నగుబాటు కాదురా
మందహాసమెంతొ మంచి చేయు
చెట్టుయంత మనిషి చిగురించు నవ్వుతో
రాధికమ్మ వాక్కు రాణకెక్కు (05)
7
పేరు చివుకుల శ్రీలక్ష్మి
తేది 13-4-2020
అంశం: చిరునవ్వు
కవితా శీర్షిక
అమ్మ చిరునవ్వు
నేనే!
అలా...అలా...
నడిచి పోతున్నా..
దారి పొడవునా
పూలబాలలే
పలకరింపుగా.....
చిరునవ్వు నవ్వుతూ
దీప తోరణాలే
మిరుమిట్లు గొలుపుతూ
చుక్కలను...... ధిక్కరిస్తూ
నవ్వుల కిరణాలు రువ్వుతూ
కవితాగాన
మాధుర్యాలే
వీనులవిందై...... అలరిస్తూ
అధరాల నవ్వులొలికిస్తూ...
సాహితీ వేత్తల
సుదీర్ఘ చర్చలే
రతనాలను .....వెలికి తీస్తూ
విజయదరహాసాలు ఒలికిస్తూ..
అవధాన పద్య ధారలే
సంస్కృతీ వైభవాన్ని ....చాటుతూ
వాలు కన్నుల చూస్తూ....
చిరుచిరు నవ్వుల పరికిస్తూ
నడిచి పోయే
అమ్మను నేను
శారదాంబను........నేనే!
8
మూర్తి శ్రీదేవి
కలంపేరు "గురుసౌభాగ్య"
అంశం : చిరునవ్వు
తేది :13-4-20
కొండంత ఆవేదనను ఆవలతోసి
సముద్రమంత భారమును
తొలగించే దివ్యౌషధం
"చిరునవ్వు"
శత్రుత్వాన్ని మిత్రుత్వంగా
మార్చి
పరస్పర సహకార సౌరభాలకు వారధి వేసే ఒకే ఒక్క చిట్కా "చిరునవ్వు"
గుండెలో గూడుకట్టుకున్న
అసూయాద్వేషాలను
పారద్రోలి
అరమరికల అలజడికి స్వస్తి పలికే ఒకే ఒక్క మంత్రం
"చిరునవ్వు"
ఆవేశ సుడిగాలులలో చుట్టుకొని కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలకు
ఆత్మవిశ్వాసాన్ని గుర్తు చేసే
మౌన భావమే "చిరునవ్వు"
సంధి కార్యాలు చేయలేని
రాయబారాలు కుదర్చలేని
రచ్చబండలు తీర్చలేని
రారాజులు ఊహించలేని
కొరకరాని సమస్యలు సైతం
సులభంగా పరిష్కరించగల
ఒకే ఒక్క రహస్యాస్త్రం "చిరునవ్వు"
దొరలు దోచలేనిది
దొంగలు అపహరించలేనిది
ఇచ్చేకొద్ది పెరిగేది
దాచేకొద్ది తరిగేది
పోగేసికొద్ది పెన్నిధై బలగం సమకూర్చే ఏకైక సంపద
"చిరునవ్వు"
గదుల్లో ధాన్యలక్ష్మి తిష్ట వేసుకుని ఉన్నా
పెట్టెల్లో మహాలక్ష్మీ కొలువై ఉన్నా
ఇంట్లో చదువుల తల్లి కూర్చుని ఉన్నా
వదనములో
"చిరునగవుల శ్రీలక్ష్మి" లేకుంటే సంతృప్తికి కొరతే...ఆనందానికి వెలితే
పుట్టుకతో వస్తే భాగ్యం
నేర్చుకుంటే నేర్పరితనం
కొనసాగిస్తే సుఖప్రయాణం
మిగిల్చిపోతే చరిత్రలిఖితం
చిరునవ్వే శాశ్వతం
చిరునవ్వే శుభప్రదం
9
పేరు. ఉదయశ్రీ ప్రభాకర్
అంశం *చిరునవ్వు*
ఆశల అంకురం..
పలకరింపులో ముందు వరుసలో నిల్చి
పరిచాయనికి పరిమళాలు అద్దే
గుర్తింపు చిరునామా చిరునవ్వు..
కనులతో ఆహ్వానాలు పలుకుతూ
మన అనే భావనను మెరిపిస్తూ
ఆత్మీయత పువ్వులు పూయించే చిరుజల్లు చిరునవ్వు
రాయి లాంటి మనసును కరిగించేను..
నిరాశల చీకట్లో వెలుగులా కాంతులు చిందించేను..
రేపటికై ఆశల అంకురమై సాగుతూ..
శిశిరంలోనూ వసంతాన్ని రుచి చూపేను..చిరునవ్వు
ఉదయశ్రీ ప్రభాకర్..
10
చిరునవ్వు
నీ తలపు ఎదన కదిలిన చాలు
నా అధరాలపై దరహాసచంద్రికలు
నీ మమత మదిన మెదలిన చాలు
నా కన్నుల్లో కాంతిధరహాసాలు
నీ చెలిమిగాలి హృదిమేఘాన వీచిన చాలు
నా హృదయధరణిపై చిరునవ్వుల జల్లు
నీ చిలిపినవ్వుచిరుజల్లు కురిసిన చాలు
నా మేనున విరియు పులకింతల పూలు
ఎంతటి ఒత్తిడినైనా ఉప్ అనిపించే నా చిరునవ్వుకు నీవే ప్రేరణ కానీ..
ఎంతో స్వచ్ఛంగ స్పటికంలా కనిపించే నీ చిరునవ్వుకు కారణం నేనే అవనీ.....
నీ కాటుకకన్నులకాంతిలో నను. కననీ కమనీయ కలలలోకాలను
నీ చిన్ని నవ్వులనావలో నను
చేరనీ నవ్వుల నవ్యలోకతీరానికి
నీ స్వచ్ఛమైన చిరునవ్వువీణ. పలకనీ వీనులకు శ్రావ్యంగా
నీ శ్రావ్యమైన చిరునవ్వులవేణువు
పలకనీ కలకాలం హృద్యంగా
::వల్లాల విజయలక్ష్మి,,ఆలేరు
11.
రమాదేవి బాలబోయిన
అంశం...చిరునవ్వు
~~~~~~~~~~
ఉషోదయపు భానుని కిరణాలే
లోకానికి వెలుగుల చిరునవ్వులు
గూటిలోని పక్షుల కిలకిలారావాలే
మేలుకొలుపు సందళ్ళ చిరునవ్వులు
వికసిత కుసుమాన ఝంకరించు
భ్రమరపు నాదమే విరులకు చిరునవ్వులు
వర్షపుఆగమన మేఘగర్జనలకు
విప్పారిన నెమలిపింఛాలే అడవికి చిరునవ్వు
పుష్టిగా కురిసే చిరుజల్లులే
ప్రకృతికాంతకు పరవశాల చిరునవ్వులు
మొలకెత్తే పైరుల పచ్చదనాలే
పుడమికన్యకు హరితవస్త్రచిరునవ్వులు
నట్టింట నడయాడు పసిపాపల కేరింతలే
మాతృత్వపు మధురిమల చిరునవ్వులు
-మృదువిరి
12.
చిరునవ్వు
అమ్మ నేర్పిన చిరునవ్వులో
అమృతం దాగి ఉంది
నాన్న నేర్పిన చిరునవ్వులో
నవ్య వీధులు దాగి ఉండు
పేగుబంధపు చిరునవ్వులో
ప్రేమ లెన్నో దాగి ఉండు
చిరునవ్వే చిరుగాలి
నవ సమాజ నడకకు
ధనంబులెన్ని ఉన్నా
అధికారం ఎంతటిదైనా
ప్రేమానుబంధాలకు
చిరునవ్వే సిరి సంపద
ఆలుమగల అద్భుతాలకు
ప్రశాంత విజయాలకు
చిరునవ్వే చిరునామా
ఏ.భూపతి
13.
పాలకుర్తి నాగజ్యోతి
అంశం: చిరునవ్వు
తనంటే ఎంతిష్టమో ~~
ఏమయిందో తెలీదు
ఎలా మాయమయిందో తెలీదు
చిన్నబోయిన నామోమును
ఎన్నిసార్లు అడుగను!
అద్దం ముందు నిలబడగానే
ఎవరో కనబడుతున్నారు..
నేనెటుపోయానో జాడతెలియక తండ్లాటై
మసకబారిన కనులను
ఎన్నిసార్లని తుడవను..
తనంటే ఎంతిష్టమో! చెప్పలేను
అధరాల పైకి
చేరిన ప్రతిసారి దరహాసపు నదీనై ప్రవహించేదానిని..
ఆ జల్లులలో తడిసినవారంతా
ప్రశంసలతో వాక్యమైపోదురంటే
అతిశయోక్తి ఏమిలేదు..
ఇపుడిలా
విశాద వదనాన్ని మోయలేక
పెదాల కొమ్మపై వాడి
రాలిపోయిన నా నవ్వులపువ్వులను ఏరుకుందామంటే..
అదెక్కడో తప్పిపోయింది!!
ఈక్షణం..
నాలోనుండి తప్పిపోయిన తనని వెతుకుంటున్నా..
అటేమైనా వస్తే ఇటు పంపరూ..
అదేనండీ
నా చిరునవ్వు ని
14
పేరు డా.బల్లూరి ఉమాదేవి
డల్లాస్ అమెరికా
అంశం: చిరునవ్వు
మల్లెల సుగంధంలా పారిజాత పరిమళంలా
అధరాల పై వెలిగే చిరు దరహాసంతో
నయం చేయవచ్చు మానసిక రుగ్మతలు
కానీ ఖర్చు లేకుండా ఆనందం పొందుతూ
పరులకు పంచే దివ్యౌషధం చిరునవ్వే కాదా
తెలియని వేదన తో దిగులుతో నిండిన వారికి
హాయిని గూర్చేదీ చిరునవ్వుతో పలకరింపే
నవ్వడం నవ్వించడం అందమైన కళ
తల్లీ పిల్లల అనురాగాలకైనా
ఆలుమగల అనుబంధాలకైనా
వారిధిగా నిలిచేది బంధాలను బలపరచేది
మాయని భామిని చిరు దరహాసం
నువ్వు నాలుగు విధాల చేటన్నారా నాడు
నవ్వే సకలరోగనివారిణి అయ్యిందీనాడు
ఒత్తిళ్లతో కార్యభారంతో సతమతమయ్యే
వారి కాహ్లాదం కూర్చేదీ నగుమోమే
కిలకిలా రావంలా గలగలపారే సెలయేరులా
నవరత్నాలు రాలేలా నలుగురు మెచ్చేలా
కనుకొలుకుల్లో నీరు చిందేలా
నిరంతరం నవ్వుతూ బ్రతకాలి మనం
కురిపించాలి నవ్వులవర్షం అనుక్షణం.

Comments
Post a Comment